కందనూలు: జిల్లా సమగ్రాభివృద్ధిలో అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తుండటంతో విశేష పురోగతి సాధిస్తున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు చేసిన ఉద్యమాలు, త్యాగాలు చిరస్మరణీయమన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి వంటి రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.
పోలీసు సేవలు మరింత చేరువ : ఎస్పీ
కందనూలు: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని.. ప్రజలకు మరింత చేరువై బాధ్యతాయుతమైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీసుపై ఉందని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అవతరించిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ సీఐ ఉపేందర్‌రావు, ఆర్‌ఐ జగన్, ఆర్‌ఎస్‌ఐ శివాజీ, ఎస్‌ఐలు పర్వతాలు, రమేశ్, నరేశ్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి చొరవతోనే సమస్యల పరిష్కారం
వీపనగండ్ల: కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు విద్య, వైద్యరంగాలకు అవసరమైన నిధులు మంజూరు చేయించడమేగాక రైతులు పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయించి రైస్‌మిల్లులకు తరలించడంతో రైతుల ఇబ్బందులు తొలగుతున్నాయని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ తెలిపారు. మంగళవారం మండలంలోని కల్వరాలలో సర్పంచ్ బండారు రాములుతో కలిసి లబ్ధిదారు మినిగె లక్ష్మికి సీఎం రిలీప్‌ఫండ్ చెక్ అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తడకల రంగమ్మ, వార్డు సభ్యులు ఆంజనేయులు, సాయప్రసాద్, సుధాకర్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు వెంకటరాజయ్య, మల్లేష్, రమేష్, తిరుపతయ్య పాల్గొన్నారు.


