● 4, 5న ప్రాజెక్ట్‌ల సందర్శన..పెండింగ్ పనుల పరిశీలన
● చివరి రోజు ఉదండాపూర్‌లోబహిరంగ సభ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోత ల పథకంతోపాటు పలు ప్రాజెక్ట్‌ల పెండింగ్ పనుల పరిశీలనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల (4, 5న) పర్యటన ఖరారైంది. తొలిరోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరనున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత నారాయణపేట జిల్లా మక్తల్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బీమా–1 లిఫ్ట్‌ను సందర్శించి.. అక్కడ నిర్మించే రోడ్ కం బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని కర్ణాటక మంత్రి బోసురాజుతో కలిసి పరిశీలించనున్నారు. ఆ తర్వాత సీఎం హెలీకాప్టర్‌లో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు చేరుకోనున్నారు. పరిశీలన అనంతరం హెలీకాప్టర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్‌కు రానున్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్యాకేజీ–2 (నారాపూర్ రిజర్వాయర్), ప్యాకేజీ–3 (కెనాల్ ) పనులను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సోమశిలలోని హరిత గెస్ట్ హౌస్‌కు చేరుకుని.. ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయా ప్రాజెక్ట్‌ల పెండింగ్ పనులపై సమీక్షించనున్నారు.
2వ రోజు ఇలా..
రెండో రోజు శుక్రవారం సోమశిల నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పీఆర్‌ఎల్‌ఐ ప్యాకేజీ–1, ఎల్లూరులోని ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్–1ను సందర్శించనున్నారు. అనంతరం నార్లాపూర్ నుంచి హెలీకాప్టర్‌లో ఉయ్యాలవాడకు చేరుకోనున్నారు. ఇరిగేషన్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో బిజినేపల్లి మండలం కుమ్మెరకు చేరుకుని పీఆర్‌ఎల్‌ఐ ప్యాకేజీ–8, వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించి ప్యాకేజీ 9, 10, 11, స్టేజీ–3 పంప్‌హౌస్‌కు సంబంధించి ప్యాకేజీ–8 పనులను పరిశీలించనునున్నారు. ఆ తర్వాత హెలీకాప్టర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్‌కు చేరుకుని ప్యాకేజీ 14, 15 పనులను పరిశీలించనున్నారు. అనంతరం జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్‌కు చేరుకుని ప్యాకేజీ 17, 18లో కొనసాగుతున్న పనులపై ఆరా తీయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడి తిరిగి హెలీకాప్టర్ హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఉండనున్నారు.


