పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జాతర మైదానంలో ప్రత్యేకంగా నైవేద్యాన్ని తయారుచేసి.. అమ్మవారికి దర్శనానికి క్యూ కట్టారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణల అనంతరం నైవేద్యం సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసింది. పెద్దకొత్తపల్లిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు
కందనూలు: అధిక జ్యేష్ట మాసం శుద్ధపౌర్ణమి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులు సామూహికంగా శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించినట్లు రామాలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. స్వామివారి కృపా కటాక్షం పొందేందుకు ఉన్న ంతలో స్వామి వ్రతం ఆచరించాలని ఆయన సూ చించారు. అనంతరం రామాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశా రు. కమిటీ సభ్యులు అర్థం రవీందర్, మల్లేష్, శ్రీను, యాదగిరి, నందకిషోర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి
గుణపాఠం తప్పదు
కొల్లాపూర్: ఎన్నికలకు ముందు మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ కారంగి బ్రహ్మయ్య అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిన్న కాంట్రాక్టర్లకు గొడ్డలిపెట్టుగా ఉన్న జీఓ 17 రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో కేవలం ప్రజాప్రతినిధుల అనుచర వర్గం, బంధువర్గానికే కాంట్రాక్టులు దక్కుతున్నాయని.. గత ప్రభుత్వంలో మాదిరిగా బడుగు బలహీన వర్గాలకు దక్కడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మోసపూరిత కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.


