బల్మూర్: మహిళలు ఎలాంటి అసమానతలకు గురికాకుండా.. సమాజంలో ధైర్యంగా జీవించేందుకు అవసరమైన సహాయన్ని అందించేందుకు ప్రభుత్వం జెండర్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటుచేసిందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బల్మూరులోని చెంచు మహిళా సమాఖ్య కార్యాలయంలో ఆదివారం జెండర్ రిసోర్స్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గృహహింస, వేధింపులు, ఇతరత్రా ఆకృత్యాలకు గురయ్యే మహిళలకు అండగా నిలవడంతో పాటు బాలకార్మిక, జోగిని వ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి ఈ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై చెంచు మహిళా స్వయం సహాయక సంఘాలకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు మహిళా సాధికారతకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. జెండర్ రిసోర్స్ సెంటర్‌లో బాధిత మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాంప్రసాద్‌గౌడ్, గోపాల్‌రెడ్డి, చెంచు మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు సైదమ్మ, ఏపీఎం సైదులు, మాజీ ఎంపీటీసీ ఖదీర్, కల్పన, రాములమ్మ పాల్గొన్నారు.


