జిల్లాకేంద్రంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు
● వాహనాల రద్దీ నియంత్రణకు
పటిష్ట చర్యలు
● రోడ్డు నిబంధనలు
ఉల్లంఘిస్తే జరిమానాలు
● ట్రాఫిక్ సిగ్నల్స్‌తో
వాహనదారులకు తప్పనున్న వెతలు
జిల్లా జనరల్ ఆస్పత్రి రోడ్డువైపు ఏర్పాటు
చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలో రోజురోజుకూ వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ.. వాహనదారులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఊరట కలిగించేందుకు జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా శ్రీపురం రోడ్డు చౌరస్తాలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను బుధవారం అందుబాటులోకి తీసుకురావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
రద్దీ ప్రాంతాల్లో మరిన్ని..
ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రస్తుతం శ్రీపురం చౌరస్తా, బస్టాండ్ వద్ద, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద సిగ్నల్స్ ఏర్పాటుచేశారు. వీటికి మరిన్ని బ్లింక్లర్స్ ఏర్పాటుచేస్తూ.. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. అదే విధంగా రద్దీ ప్రాంతాల్లో మరిన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ..
జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌తో రోడ్డు ప్రమాదాలను కొంతమేర నివారించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం కారణంగా వాహనదారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమయ్యేవారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం లాంటివి చేస్తుండేవారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కెమెరాల ఏర్పాటుతో ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుతో వాహనదారుల్లో కొంతమేర మార్పు వచ్చి రోడ్డు నిబంధనలు పాటించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


