రైతులకు ఇబ్బందులు రానివ్వం | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు రానివ్వం

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

ప్రతి రైతుకు

మద్దతు ధర అందేలా చర్యలు

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ

వేగవంతం చేస్తాం

నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి

కందనూలు: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్‌యార్డులో వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గన్నీబ్యాగుల సేకరణ, ధాన్యం కాంటా, గోదాంలకు తరలింపు తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పంటలకు నిర్ణయించిన మద్దతు ధర పూర్తిస్థాయిలో ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తమ పంటను మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చిన వెంటనే టోకెన్ల ఆధారంగా నమోదుచేసి.. ఆలస్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ అన్నారు. అదే విధంగా రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తేమశాతం, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ.. కొనుగోళ్లు చేపడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో వ్యవహరించాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే సిబ్బంది సంఖ్య పెంచి రైతులకు ఏ సమస్య లేకుండా ధాన్యం సేకరించాలని సూచించారు.

విద్యతోనే సమాజాభివృద్ధి..

విద్యతోనే సమాజాబివృద్ధి సాధ్యమని ఎంపీ మల్లు రవి అన్నారు. కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి బుధవారం జిందాల్‌ స్టీల్‌ పవర్‌ సంస్థ సౌజన్యంతో కలెక్టరేట్‌ వద్ద నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని కుమ్మెర, పెద్దాపూర్‌, గన్యాగుల, మంతటి, గగ్గలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే 130 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువు కొనసాగించడంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో రవాణా సౌకర్యం ఒకటి అని అన్నారు. విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోవాలనే ఆలోచనతో సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారి కుర్మయ్య, జిందాల్‌ సంస్థ ప్రతినిధి రెడ్డి నాయక్‌, విద్యాశాఖ అధికారి వెంకట్‌శెట్టి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement