మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెట్టొద్దు

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

కల్వకుర్తి రూరల్‌: మొక్కజొన్న ధాన్యం సేకరణ ప్రక్రియలో వేగం పెంచి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. మొక్కజొన్న కొనుగోలు సందర్భంగా గోదాముల వద్ద రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై పలువురు రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలోని మొక్కజొన్న గోదాంను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో సమస్యలను తెలుసుకున్నారు. గోదాంలో మొక్కజొన్న బస్తాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని గోదాంకు తరలించేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే.. వెంటనే జిల్లా అధికారులకు ఫోన్‌చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పసుల రమాకాంత్‌రెడ్డి, గోలి సురేందర్‌రెడ్డి, శ్రీపురం హరీశ్‌రెడ్డి, సీఐ నాగార్జున ఉన్నారు.

బాదేపల్లి యార్డుకు

పోటెత్తిన ధాన్యం

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 9,328 బస్తాల ధాన్యం యార్డుకు రావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది. ఽఅలాగే రైతులు 4,803 బస్తాల మొక్కజొన్న మార్కెట్‌కు వచ్చింది. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌రకం క్వింటా గరిష్టంగా రూ.2,499, కనిష్టంగా రూ.1,601, వేరుశనగకు గరిష్టంగా రూ.7,762, కనిష్టంగా రూ.6,199, ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,254,ఽ పొద్దుతిరుగుడు రూ.5,812, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,845, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం గరిష్టంగా రూ.2,401, కనిష్టంగా రూ.2,065, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,758గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement