ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సరికాదు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సరికాదు

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

వనపర్తి రూరల్‌: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం సరికాదని.. తూకం చేసిన వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డును పార్టీ నాయకుల బృందంతో కలిసి సందర్శించారు. ఐకేపీ, సింగిల్‌విండో ద్వారా కొనసాగుతున్న కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా తూకం చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వెంటనే పూర్తిచేసి తరలించాలని కోరారు. లారీల కొరతతో తూకం చేసిన ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాలకు తడిసే ప్రమాదం ఉందన్నారు. మిల్లు యజమానులు ధాన్యం దించుకునే సమయంలో సమస్యలు సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపడుతున్నామని.. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌రెడ్డి, జీఎస్‌ గోపి, మండ్ల రాజు, జిల్లా కమిటీ సభ్యులు బాల్యానాయక్‌, ఆంజనేయులు, ఆసీఫ్‌, కార్యదర్శి ఉమా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement