నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను అమాంతం పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దన్ పర్వతాలు విమర్శించారు. తాజాగా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంపును నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కట్టెలపొయ్యి ఏర్పాటుచేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతుండటంతో ప్రజల జీవన ప్రమాణాలు విచ్ఛిన్నమవుతున్నాయని అన్నారు. కమర్షియల్ వంటగ్యాస్ ధర ఏకంగా రూ.వెయ్యి పెంచి.. చిన్నచిన్న హోటళ్లు నడుపుకొని జీవిస్తున్న వారిపై పెనుభారం మోపడం సరైంది కాదన్నారు. దేశ ప్రజలు మళ్లీ కట్టెలపొయ్యి వాడే స్థితికి తీసుకొస్తున్నారన్నారు. ఇప్పటికై నా పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కందికొండ గీత, పొదిల రామయ్య, సత్యనారాయణ, మల్లిఖార్జున్, బంగారయ్య, లక్ష్మయ్య, ఖాజా, నర్సింహ, సిద్దూ, శిరీష, లక్ష్మి, పార్వతమ్మ పాల్గొన్నారు.


