కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే ప్రతి అధికారి, ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టంచేశారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఉదయం 10:38 గంటలకు జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని తనిఖీ చేయగా.. ఆ సమయానికి కూడా సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం, అప్పటికే వివిధ పనులపై పిటిషనర్లు, రిటైర్డ్ పెన్షనర్లు కార్యాలయంలో వేచి ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యాలయానికి ప్రజలే ముందుగా వచ్చి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోందని ప్రశ్నించారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తంచేస్తూ.. సంబంధిత అధికారులను వివరణ కోరారు. అయితే ట్రెజరీ అధికారి సెలవులో ఉన్నారని తెలియజేయగా.. సిబ్బంది పర్యవేక్షణలో ఎలాంటి లోపం ఉండకూడదని కలెక్టర్ స్పష్టంచేశారు. రోజు ఉదయం 10 గంటలలోగా ప్రతి అధికారి, సిబ్బంది కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించారు. లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయానికి హాజరుకాని సిబ్బందిపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖలో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని.. బాధ్యతారహిత వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు
సమయపాలన పాటించాల్సిందే..
కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
సకాలంలో విధులకు హాజరుకాని ట్రెజరీశాఖ సిబ్బందిపై ఆగ్రహం
ఈవీఎం గోదాం తనిఖీ
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ తనిఖీ చేశారు. అందులో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు తదితర ఎన్నికల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీసీ నిఘా పెంచడంతో పాటు పరికరాల నిర్వహణ సకాలంలో చేపట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.


