కందనూలు: ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికీ ఆర్థిక భద్రత కల్పించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బక్రీద్ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: రాబోయే బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో సీఐ అశోక్‌రెడ్డి ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,392
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్‌కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.


