మన్ననూర్: వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్ సూచించారు. మంగళవారం మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని స్టోర్‌రూంలో నిల్వ ఉన్న మందులను పరిశీలించడంతో పాటు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పీహెచ్‌సీలో మధ్యాహ్నం తర్వాత సేవలు సక్రమంగా అందడం లేదనే సమాచారంపై ఆయన వివరణ అడిగారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి సమీపాన పీహెచ్‌సీ ఉన్నందున ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న ఆశ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆశావర్కర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎంహెచ్‌ఓ వెంట డిప్యూటీ డీఈఎంఓ చారి, ఏపీఎంఓ మధుమోహన్, డా.సుధాకర్, లోక్యానాయక్ ఉన్నారు.


