● ఆదాయ, వ్యయాలకు సరితూగని నిధులు
● చాలాచోట్ల కార్మికుల వేతనాలకే సరిపోని దుస్థితి
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాసులే ఆధారం
● జిల్లాలోని పురపాలికల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం
అచ్చంపేట: మున్సిపల్ జనరల్ ఫండ్ అనేది స్థానిక ప్రభుత్వానికి ప్రాథమిక నిర్వహణ నిధి. ఇది రోజువారి కార్యకలాపాలు, సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రజా భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఉద్యాన వనాలు, సాధారణ పరిపాలన వంటి ముఖ్యమైన సేవలకు వినియోగిస్తూ ఆదాయ, వ్యయాలలో సమతుల్యత సాధించాలి. ఆస్తి, నీటిపన్నులు, ట్రేడ్ లైసెన్స్‌లు, అడ్వర్టైజ్‌మెంట్ పన్నులు, రుసుంలు, వివిధ రకాలుగా వచ్చే ఆదాయాలను ఏకీకృతం చేసి బ్యాలెన్సును పెంచుకోవాలి. అయితే జిల్లాలో మున్సిపాలిటీలు ఏర్పడి దశాబ్దకాలం గడుస్తున్నా జనరల్ ఫండ్ కార్మికుల వేతనాలకే సరిపోని పరిస్థితి. దీంతో రోజువారీ నిర్వహణలో వెనుకబాటు తప్పట్లేదు. స్వయం సమృద్ధి సాధించలేక పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైఫల్యం ఎక్కడా..
మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నిర్ధారణ సరైనా పద్ధతిలో జరగడం లేదనే విమర్శలున్నాయి. భవనాలకు సంబంధించి కొలతలలో సరైన అంచనాలు చేపట్టకుండా రెవెన్యూ విభాగం అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విభాగం అధికారులు తమ జేబులు నింపుకోవడమే తప్పితే మున్సిపల్ ఆదాయం పెంపుపై దృష్టిసారించడం లేదనే అపవాదు వస్తుంది. రెసిడెన్సియల్ అనుమతులు తీసుకొచ్చి కమర్షియల్ నిర్మాణాలు చేపట్టినా, భవనాల కింద సెల్లార్లు నిర్మిస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించడం వెనక మామూళ్లే కారణమనేది బహిరంగ రహస్యం. లీజు భూముల ఆదాయం ప్రతి మూడేళ్లకోసారి సవరించి పెంచాల్సి ఉండగా.. నేటికీ ఏళ్లనాడు నిర్ధారించిన పన్నులనే వసూలు చేయడం గమనార్హం. మిషన్ భగీరథ నల్లాలు ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు పన్నులు నిర్ధారించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.
ఆ రెండు మున్సిపాలిటీలే..
2025– 26 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీలు మాత్రమే ఇంటి పన్నుల వసూళ్లలో ముందంజలో ఉండగా.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు అవకాశం లభించింది. అలాగే నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 2024– 25 కంటే రూ.40 లక్షలు ఎక్కువ నిధులు వసూలు చేసినా 2025– 26లో 15వ ఆర్థిక సంవత్సరం నిధులకు అర్హత సాధించలేదు. కల్వకుర్తి మున్సిపాలిటీ నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోలేదు. గృహాలు, ప్రైవేట్ దుకాణాల సముదాయాల వారు కొంత మేర చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోగా.. అధికారుల చుట్టూ తిరిగి నోటీసులు ఇస్తున్నా పట్టింపు లేదు.


