● రేయింబవళ్లు తేడా లేకుండా పేలుళ్లు
● ఆందోళన చెందుతున్న అన్నదాతలు
కల్వకుర్తి రూరల్: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బ్లాస్టింగ్‌లు చేస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. మండలంలోని జీడిపల్లి శివారులో విద్యుత్ థర్మల్ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న బ్లాస్టింగ్‌తో రైతులు ఆందోళన చెందుతున్నారు. 12 అడుగుల వెడల్పు 18 అడుగుల ఎత్తులో పిల్లర్ల నిర్మాణానికి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్‌లు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ శాఖల అధికారుల అనుమతులు లేకుండానే పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారని సమీపంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అవినీతి అధికారుల మద్దతుతో ఇష్టానుసారంగా రేయింబవళ్లు తేడా లేకుండా జరుగుతున్న పేలుళ్లతో సమీపంలో ఉన్న బోరుబావులు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
పంటలపై తీవ్ర ప్రభావం
బ్లాస్టింగ్ కారణంగా సమీపంలోని భూములు కంపించి, బోరు బావుల్లో కుదుపు రావడంతోపాటు పంటలపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్‌తో రైతులకు మేలు చేసే క్రిములు చనిపోయే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ శాఖల అధికారుల అనుమతులు లేకుండానే వీరికి పేలుడు పదార్థాలు ఎలా వస్తున్నాయి అని పలువురు చర్చించుకుంటున్నారు. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల షాపులు ఏర్పాటు చేయాలంటే ఎంతోమంది అధికారుల అనుమతులు తనిఖీలు ఉంటాయి. అలాంటిది బాంబులు పెట్టి పేలుళ్లు చేస్తుంటే ఎవరికి పట్టకపోవడంతో అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు ఉండి బ్లాస్టింగ్ చేయాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. ఏదీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున పేలుళ్లు జరుగుతుండడంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంబులను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులంటున్నారు.
విచారణ జరుపుతాం..
జీడిపల్లి సమీపంలో జరుగుతున్న బ్లాస్టింగ్‌లకు అనుమతులు ఏమైనా ఉన్నాయా అని ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి కోరగా.. తనకు ఎలాంటి సమా చారం లేదని ఇంతకు ముందు ఎవరైనా అనుమతులు ఇచ్చారో తెలియదన్నారు. దీనిపై విచారణ జరుపుతామని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని వివరించారు.


