కందనూలు: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పనితీరుకు నిదర్శనం ఫలితాలు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు అన్నారు. పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ కూడలిలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పునాది పశ్చిమబెంగాల్‌లో పుట్టిందని, అక్కడ పుట్టిన నాయకుడే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన ఆశయ సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాతోపాటు అనేక మంది నాయకులు దేశంలో చేస్తున్న నిస్వార్థ సేవలకు బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయానికి కారణమన్నారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, అంత్యోదయ సిద్ధాంతం అమలు కార్యక్రమాలను ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన అందించినందుకే ప్రజలు ఆత్మవిశ్వాసంతో బీజేపీని గెలిపించారన్నారు. మూడు రాష్ట్రాల్లో ప్రజాతీర్పునకు అనుగుణంగా రాబోయే కాలంలో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. దేశంలో 370 ఆర్టికల్, రామ జన్మభూమి, త్రిపుల్ తలాక్, ఒక దేశం– ఒకే చట్టం, సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అనే నినాదంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్, కార్యాలయ కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు.


