ఈతకు వెతలు! | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెతలు!

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

కొల్లాపూర్‌: వేసవి సెలవు దినాల్లో ఈత నేర్చుకోవడం చిన్నారులకు గగనంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా ఎక్కడా పబ్లిక్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ లేకపోవడంతో ఎంజీకేఎల్‌ఐ కాల్వలు, బావులను ఆశ్రయిస్తున్నారు. అయితే వాటి లోతు ఎక్కువగా ఉండటం.. జమ్ము, ముళ్లపొదలు కాళ్లకు చుట్టుకోవడం వంటి కారణాలతో ఏటా చిన్నారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఈత నేర్చుకునే క్రమంలో పలువురు మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రమాదాల నివారణకు క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్‌ పూల్స్‌ ఏర్పాటుచేసి.. చిన్నారులకు ఈత నేర్చుకునే వెసులుబాటు కల్పించడమే ఉత్తమ మార్గమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కొల్లాపూర్‌లో అసంపూర్తిగా పనులు..

కొల్లాపూర్‌లోని మినీ స్టేడియంలో 2017లో స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అప్పట్లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు యువజన, క్రీడాశాఖ ద్వారా రూ. 1.80కోట్లు మంజూరు చేయించారు. మినీస్టేడియం నిర్మించిన గుత్తేదారుకే పనులు అప్పగించగా.. పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు కట్టబెట్టారు. ఆరు నెలల్లో పనులు పూర్తిచేయాలని అప్పట్లో జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. అయితే నిధులలేమి కారణంగా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అయితే కొన్ని నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణంపై అధికారులతో చర్చించారు. త్వరగా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. అయితే ఈ వేసవిలో స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభమవుతుందని అంతా భావించారు. కానీ పనులు ఇప్పుడు కూడా నత్తనడకనే సాగుతున్నాయి.

వేసవిలో ఈత నేర్చుకునేందుకు బావులు, కాల్వలే దిక్కు

ఏటా ప్రమాదాల బారినపడుతున్న చిన్నారులు

జిల్లాలో ప్రైవేటు స్విమ్మింగ్‌ పూల్స్‌కు డిమాండ్‌

క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్‌ పూల్స్‌ నిర్మించాలని ప్రజల వేడుకలు

ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి..

జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో కూడా పబ్లిక్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఏర్పాటుచేయాలి. చిన్నపిల్లలు ఈత నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. బావులు, కాల్వల వద్దకు వెళ్లి పిల్లలు మృత్యువాత పడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు స్విమ్మింగ్‌ పూల్స్‌ ఏర్పాటే పరిష్కార మార్గం. మార్నింగ్‌ వాకర్లు, యువతకు కూడా స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉపయోగపడతాయి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి.

– ఎర్రమోని యాదగిరి, కొల్లాపూర్‌

అసంపూర్తి పనులపై దృష్టి..

కొల్లాపూర్‌లో అసంపూర్తిగా ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల పురోగతి కొన్ని నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. అచ్చంపేటలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్‌పూల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేస్తున్నాం. ఈత కోసం బావులు, కాల్వలకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. – సీతారాం, డీవైఎస్‌ఓ

Advertisement
 
Advertisement
Advertisement