● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
కొల్లాపూర్: ‘విద్యార్థుల ఆత్మబలిదానాలు చూసి చలించిపోయా.. సకలజనుల సమ్మె తర్వాత తెలంగాణ ఉద్యమం ఆగిపోయే పరిస్థితులు వచ్చాయి.. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మరో పెద్దమనిషి ఉద్యమాన్ని ఎద్దేవా చేసేలా మాట్లాడారు.. పదవులు లేకుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉండలేరని విమర్శించారు.. అందుకే మంత్రి పదవులు త్యజించి ఉద్యమంలో, టీఆర్‌ఎస్ పార్టీలో చేరా.. తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియంతృత్వ పోకడలను తలపించాయి.. అడ్డగోలుగా దోపిడీ జరిగింది.. ఇవన్నీ మీరు కూడా చూశారు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని’ రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ముగింపు సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేశారు. ఆర్డీఓ బన్సీలాల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్ని అప్పులున్నా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని మంత్రి వివరించారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలే ఇందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొల్లాపూర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిందని, వీటిలో 3,117 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, వందల సంఖ్యలో ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. సమావేశంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
పెంట్లవెల్లి మండలంలోని మాధవస్వామినగర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మొక్కజొన్న కొనుగోలు చేసిన వెంటనే రవాణా జరిగేలా చూడాలని లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జటప్రోల్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పరిశీలించారు. అలాగే గ్రామంలోని మధనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులపై సూచనలు చేశారు.


