గన్నీ బ్యాగుల కొరతకు ప్రత్యామ్నాయ చర్యలు | - | Sakshi
Sakshi News home page

గన్నీ బ్యాగుల కొరతకు ప్రత్యామ్నాయ చర్యలు

May 3 2026 8:05 AM | Updated on May 3 2026 8:05 AM

కందనూలు: జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నా గన్నీ బ్యాగుల కొరత ప్రధాన సమస్యగా మారిందని, దీన్ని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందని కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌ పాటిల్‌ అన్నారు. శనివారం ఆయన అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా ఇప్పటి వరకు సుమారు 68 వేల మె.ట., కొనుగోలు చేశామన్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయడానికి ఇంకా 30 లక్షల గన్నీ సంచులు అవసరమని అధికారులు అంచనా వేశారన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో సరఫరా తగ్గడం, లభ్యతలో అంతరాయం ఏర్పడటంతో గన్నీ సంచుల కొరత తలెత్తిందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. అలాగే రైతులు గన్నీ సంచులను స్వయంగా సమకూర్చుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైతులు తీసుకువచ్చే గన్నీ సంచులను నాణ్యతా ప్రమాణాల మేరకు పరిశీలించి.. ప్రతి గన్నీ సంచికి ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం చెల్లించాలని స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో గన్నీ సంచుల ధరలను స్పష్టంగా ప్రదర్శించడంతోపాటు, రికార్డులను జిల్లా స్థాయిలో నిరంతరం తనిఖీ చేయనున్నట్లు వెల్లడించారు.

మహిళల ఆర్థిక అభ్యున్నతికి

ఇందిరా మహిళా శక్తి

కలెక్టరేట్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా శక్తి ఇందిరమ్మ క్యాంటీన్‌ను శనివారం కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ ఆకస్మికంగా తనిఖీచేశారు. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాంటీన్‌ పనితీరును ప్రత్యక్షంగా సమీక్షించారు. క్యాంటీన్‌లో వంటకాలు తయారు చేసే విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార పదార్థాల నాణ్యతను కలెక్టర్‌ సమగ్రంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement