కందనూలు: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026– 27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇంటర్‌లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి.. అత్యుత్తమ బోధన, పోటీ పరీక్షలపై ఉచిత శిక్షణ, నాణ్యమైన భోజనం, అవసరమయ్యే నోట్ పుస్తకాల నుంచి క్రీడా పరికరాలు పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరం లాంటిదని చెప్పవచ్చు.
వివిధ కోర్సుల్లో సీట్లు..
జిల్లావ్యాప్తంగా 10 బీసీ గురుకుల కళాశాలలున్నాయి. అందులో ఆరు మహిళా కళాశాలలు, నాలుగు బాలుర కళాశాలలు ఉండగా.. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, కోర్సుల్లో కలిపి మొత్తం 960 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. ఈ ఏడాది వెలువడిన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 85.80 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 90.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. కల్వకుర్తి బాలికల కళాశాల, బిజినేపల్లి బాలుర కళాశాలల్లో జేఈఈ, నీట్, ఎప్‌సెట్, ఎన్‌ఐటీ తదితర పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర యూనివర్శిటీలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు.
12లోగా దరఖాస్తు చేసుకోవాలి..
బీసీ గురుకులాల్లో చేరే విద్యార్థులు అడ్మిషన్ కోసం https//mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 12లోగా రూ.200 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పదో తరగతి మెరిట్ ప్రకారం విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. బీసీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఆయా గురుకుల ప్రిన్సిపాళ్లకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.


