ఇంటికే పోషకాహారం | - | Sakshi
Sakshi News home page

ఇంటికే పోషకాహారం

May 1 2026 8:20 AM | Updated on May 1 2026 8:20 AM

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

పంపిణీ ఇలా..

జిల్లాలో ఐదు ప్రాజెక్టులు..

3 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు

పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు

అందించాలని ఆదేశం

వేసవిని దృష్టిలో ఉంచుకొని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. పోషకాహార సరుకులు లబ్ధిదారుల ఇంటికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి సరిపడా సరుకులు పంపిణీ చేస్తాం.

– రాజేశ్వరి, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి

కందనూలు: రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి పౌష్టికాహారం తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. చాలా వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడం, కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు కూడా సరిగా ఉండకపోవడంతో చిన్నారులు, గర్భిణులు వచ్చేందుకు నిరాసక్తి చూపుతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మే 3 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించింది. లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పౌష్టికాహారం పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే సమయాల్లో మార్పు..

ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాల పనివేళలను ప్రభుత్వం ఇప్పటికే సవరించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. సెలవుల కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో వడ్డించే భోజనానికి అంతరాయం కలగకుండా ప్రభుత్వం టేక్‌ హోమ్‌ రేషన్‌ విధానాన్ని అమలుచేస్తోంది. మే నెలకు సరిపడా సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

క్షేత్ర స్థాయిలో టీచర్లకు బాధ్యతలు..

అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఉన్నప్పటికీ టీచర్లు, ఆయాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. చిన్నారులు, గర్భిణుల ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించడంతో పాటు పౌష్టికాహారం పంపిణీ చేయాలి. శారీరక, మానసిక ఎదుగుదల లోపించిన పిల్లలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలుచేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

బాలింతలు, గర్భిణులకు మే నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనె, పాల పాకెట్లను అందజేస్తారు. 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు బాలామృతంతో పాటు 16 కోడిగుడ్లు, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు బియ్యం, పప్పు, నూనె, కురుకురే పాకెట్లను పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు.

జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, బల్మూర్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌ ప్రాజెక్టుల పరిధిలో 1132 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు 21,912 మంది, 3ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు వారు 13,010 మంది, గర్బిణులు, బాలింతలు కలిపి 7,927 మంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement