టూరిజం హబ్‌గా సోమశిల | - | Sakshi
Sakshi News home page

టూరిజం హబ్‌గా సోమశిల

May 1 2026 8:20 AM | Updated on May 1 2026 8:20 AM

పర్యాటకులకు మరింత

ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు

కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

కొల్లాపూర్‌ రూరల్‌: సోమశిలను టూరిజం హబ్‌గా తీర్చిదిద్ది.. ప్రకృతి సోయగాల కేంద్రంగా గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. గురువారం ఆయన సోమశిలను సందర్శించి.. అక్కడ కొనసాగుతున్న ఎకో టూరిజం ప్రాజెక్టు, హెలీ టూరిజం పనులతో పాటు పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రకృతి సోయగాలు కలిగిన సోమశిలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధిచేసి, పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో ప్రముఖ టూరిజం హబ్‌గా మారే అవకాశముందన్నారు. పర్యాటకరంగ అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందన్నారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించే సోమశిల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. నల్లమల కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, అడవి పచ్చదనం వంటి సహజ సౌందర్యాన్ని పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అదే విధంగా పర్యాటకులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని.. అధికారులు కూడా అదే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 167కే జాతీయ రహదారిలో భాగంగా కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణం పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానం మరింత మెరుగుపడటమే కాకుండా, సోమశిలకు పర్యాటకుల రాకపోకలు గణనీయంగా పెరిగే ఆవకాశముందని తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ బన్సీలాల్‌, జిల్లా టూరిజం అధికారి నర్సింహ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement