మార్కెట్‌లో భారీగా పడిపోయిన ధరలు
● టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 45వేలకు మాత్రమే కొనుగోలు
● కవర్ కాయల పరిస్థితి కూడా అంతే..
● ఆందోళనలో మామిడి రైతులు
ధరలు తగ్గించేశారు..
రైతులకు మామిడి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలోనే ధరలు తగ్గించడం దారుణం. గాలివానకు భయపడి రైతులు కాయలు తెంచుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కాయలు అమ్మితే రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. – పెద్దూరి లక్ష్మయ్య,
మామిడి రైతు, కొల్లాపూర్
మార్కెట్ ఏర్పాటుచేయాలి..
కొల్లాపూర్‌లో వేలాది మామిడి రైతులు ఉన్నారు. వారి శ్రమను వ్యాపారులు దోస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ అంశంగా గుర్తించారు. గతంలో మాచినేనిపల్లి సమీపంలో, ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో మామిడి మార్కెట్ ఏర్పాటుకోసం స్థలాలను గుర్తించారు. రెండింట్లో ఏదో ఒక చోట మార్కెట్ ఏర్పాటుచేసి, వ్యాపారులు ఇక్కడే కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది.
– సాయికృష్ణగౌడ్, మామిడి రైతు, సింగోటం
కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్‌లో వ్యాపారుల సిండికేట్‌కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది.
స్థానికంగా మార్కెట్ లేకపోవడమే సమస్య..
మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్‌లో మార్కెట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మార్కెట్‌లో కొల్లాపూర్ మామిడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడతారు. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. రైతులు అడిగితే ఏపీ నుంచి కాయలు పెద్దమొత్తంలో వస్తుండటంతో ధరలు తగ్గించామనే సమాధానం చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు తగ్గితే.. స్థానికంగా కాయలు కొనుగోలుచేసే ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను తగ్గించేస్తున్నారు. కొల్లాపూర్‌లో ప్రభుత్వమే మార్కెట్ ఏర్పాటుచేసి.. ఇక్కడి కాయలను స్థానికంగా విక్రయించుకునే వెసలుబాటు ఉంటే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని మామిడి రైతులు కోరుతున్నారు.
చివరలో నిలిచిన పూతలు..
ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు.


