● అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, జీవీ శ్యాంప్రసాద్ లాల్‌తో కలిసి ఆయ న ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 33 దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కందనూలు: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి యాసంగి సీజన్‌కు సంబంధించిన మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా వెనువెంటనే ధాన్యం సేకరించాలని సూచించారు. రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు లేకుండా చూడాలన్నారు. తూకం ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే సహించమన్నారు. అదే విధంగా రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తేమశాతం విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 4.71లక్షల ఎకరాల్లో పంటసాగు జరిగిందని, అందులో 2,4,621 ఎకరాల్లో మొక్కజొన్న, 1.81 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగినట్లు డీఏఓ యశ్వంత్‌రావు కలెక్టర్‌కు వివరించారు. 7.16 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న, 4.37లక్షల క్వింటాళ్ల వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కేంద్రాల్లో వడ్లు ఎండబెట్టేందుకు స్థలం, తాగునీటి సదుపాయం, తాత్కాలిక గోదాములు వంటి మౌలి క వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. వర్షాల కారణంగా ధాన్యం నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, జిల్లాస్థాయి సమీక్షకు మార్కెటింగ్‌శాఖ అధికారి సన్‌ప్రీత్ సింగ్ గైర్హాజరు కావడంతో షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ ఎండీ తమీన, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింహారావు, సివిల్ సప్లయ్ అధికారి రాజేందర్ ఉన్నారు.
స్వీయ జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి..
స్వీయ జనగణనను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్ వీసీ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 20 మండలాల్లో 460 గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 86 వార్డుల్లో జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు జరుగుతున్న మొదటి దశ స్వీయ గణన ప్రక్రియలో ప్రజలు వందశాతం భాగస్వామ్యం కావా లని పిలుపునిచ్చారు. http://se.census.gov.in ద్వారా ఎవరికి వారు స్వయంగా తమ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో జనగణనకు 2,500 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వీయ గణన చేసుకోని వారి వివరాలను జనగణన అధికారి ఇంటికి వచ్చినప్పుడు నమోదు చేస్తారన్నారు. స్వీయ గణనలో ఏదైనా తప్పులు నమోదు చేసుకుంటే అధికా రి సరిచేస్తారని తెలిపారు. ప్రభుత్వ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డులకు జనగణనతో సంబంధం లేదన్నారు. సర్వేలో నమోదయ్యే వివరాలు జనగణన సంస్థ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లకు ప్రజలు సరైన సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి
కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి సన్‌ప్రీత్ సింగ్‌కు షోకాజ్ నోటీసు


