● జిల్లాలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
● ఉదయం నుంచే దంచికొడుతున్న ఎండలు
కల్వకుర్తి టౌన్: ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఎండల తీవ్రతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. భరించలేనంత ఉక్కపోత.. వేడి సెగలకు బెంబేలెత్తున్నారు. మధ్యాహ్నం వేళలో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండల ధాటికి చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో రెండు రోజులుగా 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా పెంట్లవెల్లి మండలంలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కోడేరులో 42.8, కల్వకుర్తిలో 42.6, ఊర్కొండలో 42.4, పెద్దకొత్తపల్లిలో 42.2, తెలకపల్లిలో 42.1, నాగర్‌కర్నూల్‌లో 41.8, తిమ్మాజిపేటలో 41.7, బిజినేపల్లిలో 41.5, తాడూర్‌లో 41.4, వంగూర్‌లో 41.2, అచ్చంపేటలో 40.9, కొల్లాపూర్‌లో 40.6, బల్మూర్‌లో 40.4, చారకొండలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత్తలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలతో వ్యవసాయ, కూలీ పనులకు వెళ్లే శ్రమజీవులు సతమతమవుతున్నారు. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, మేలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రజలు వడదెబ్బ బారినపడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.


