పెద్దకొత్తపల్లి: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పెద్దకొత్తపల్లిలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావడంలేదని ఉందని చెప్పడంతో ఆయన వెంటనే మార్కెఫెడ్ డీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. కొనుగోలుచేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చిన వెంటనే తూకం వేయాలని.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో పరిసర గ్రామాల రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు. దళారుల బెడద లేకుండా రైతుకు మద్దతు ధర లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దండు నర్సింహ, లక్ష్మయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


