కందనూలు: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడోరోజుకు చేరింది. జిల్లాకేంద్రంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కట్లకు గురయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక స్థోమత కలిగిన వారు కార్లలో వెళ్లగా.. సాధారణ ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదని భీష్మించారు. ఉదయం బస్ డిపో నుంచి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా బయలుదేరి ప్రధానరోడ్డు మీదుగా బస్టాండ్ వరకు చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించి.. ప్రభత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని నినదించారు. అనంతరం నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన కండక్టర్ శంకర్‌గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు.
తాత్కాలిక సిబ్బందితో సర్వీసులు..
ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారులు బస్సులు నడిపించారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి రూట్లతో సర్వీసులు పాక్షికంగా రాకపోకలు సాగాయి. 8 ఆర్టీసీ, 29 ప్రైవేట్ బస్సులు నడిపినట్లు డీఎం యాదయ్య వెల్లడించారు. 37 బస్సులు రోడ్డెక్కితే ఇందులో 24 మంది కండక్టర్లతో మాత్రమే నడిపించారు. మిగతా బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
మక్కల కొనుగోలులో వేగం పెంచాలి
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లావ్యాప్తంగా రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలులో వేగం పెంచాలని బీఆర్‌ఎస్ నేత నాగం శశిధర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రం నెల్లికొండ చౌరస్తాలోని మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన ధర్నాకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వీడి.. సేకరణలో వేగం పెంచి రైతులకు తగు న్యాయం చేయాలని కోరారు. గడిచిన 15 రోజుల క్రితం తూకాలు వేసిన సంచులను నేటికీ గోదాంలకు తరలించకపోవడం దుర్మార్గం అన్నారు. ఫలితంగా గన్నీ బ్యాగుల కొరత ఏర్పడి కొనుగోలులో జాప్యం జరుగుతుందన్నారు. అకాల వర్షాల ముప్పు, రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు అర్థం రవి, బాలగౌడ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


