● తాము చెప్పినట్లుగా నడుచుకోవాలని ఓ నేత అజమాయిషీ
● ఉద్యోగి ఎవరైనా సరే చెప్పినట్టు చేయాల్సిందేనని హుకూం
● మాట వినకపోతే ట్రాన్స్‌ఫర్ చేయిస్తామని బెదిరింపులు
● వేధింపులు తాళలేక
దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు
ఓ అధికారి ప్రయత్నం
మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులకు మధ్య విభేదాలు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులు, అధికారులకు మధ్య వ్యత్యాసం పెరిగిపోతోంది. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి రెండు నెలలు గడవక ముందే అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారని వార్డు ఆఫీసర్లు ఒకరికొకరు చెప్పుకొంటూ ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు. మున్సిపాలిటీ పాలన వ్యవహారాలు చూసే మరో అధికారిని అనధికార ప్రజాప్రతినిధి తనదైన రీతిలో ఇబ్బందులకు గురిచేయడంతో సదరు అధికారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతోంది. మున్సిపాలిటీలో జరిగే కొన్ని వ్యవహారాలలో తాము చెప్పినట్టు చేయాలే తప్పా.. మీకు తోచినట్టుగా మాకు సలహాలు ఇస్తే కుదరదని చెబుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య నిశ్శబ్ద కోల్డ్ వార్ సాగుతోంది.


