అరకొరగానే సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

అరకొరగానే సర్వీసులు

Apr 24 2026 7:44 AM | Updated on Apr 24 2026 7:44 AM

రెండోరోజు కొనసాగిన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె

పాక్షికంగా నడిచిన బస్సులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

కార్మికులకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాల నాయకులు

కందనూలు/ అచ్చంపేట రూరల్‌/ కల్వకుర్తి టౌన్‌: ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె గురువారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని డిపోల ఎదుట ఆందోళన నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ బస్‌ డిపో ఎదుట జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి తక్కువ జీతాలతో ఉద్యోగాలు చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు, డబుల్‌ డ్యూటీల విధానంతో ఇబ్బందులు పడుతున్నామని వాటిని పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పారు. వీరికి పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా కార్మికుల సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రజలు ఆటోలు, జీపులు వంటి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా నాగర్‌కర్నూల్‌ డిపో నుంచి 33 ప్రైవేట్‌ బస్సులు, 2 ఆర్టీసీ బస్సులను నడిపించామని, శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్‌ యాదయ్య తెలిపారు.

● కల్వకుర్తిలో మధ్యాహ్న సమయంలో ఉద్యోగులంతా కలిసి డిపో ఎదుట వంటావార్పు చేయడానికి సిద్ధమవ్వగా పోలీసులు అడ్డు చెప్పారు. ఎండలో నిరసన తెలియజేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఉప్పల వెంకటేష్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణ నాయకులు అంబలి అందించారు.

● అచ్చంపేట ఆర్టీసీ డిపో పరిధిలోని కార్మికులంతా జేఏసీ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. చైర్మన్‌గా ఏజే రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా జె.గోపాల్‌, కన్వీనర్‌గా చంద్రయ్య, కోకన్వీనర్లుగా ఆర్‌ఎస్‌ నారాయణ, యాదమ్మ, శ్రీనివాసులు, కేఎస్‌ రెడ్డి, కోశాధికారిగా సురేష్‌, ప్రచార కార్యదర్శిగా రమేష్‌తోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

పురుష ప్రయాణికులపై వివక్ష

పెద్దకొత్తపల్లి: చార్జీలు చెల్లించి ప్రయాణించే పురుషులపైనే ఆర్టీసీ వివక్ష చూపిస్తోంది. ఏకంగా ఆర్టీసీ బస్సు అద్దంపై మహిళలకు మాత్రమే బస్సు సౌకర్యం అని స్టిక్కర్‌ అంటించుకొని రావడంతో పురుష ప్రయాణికులు ఖంగుతిన్నారు. హైదరాబాద్‌ హెచ్‌టూ డిపోకు చెందిన బస్సు గురువారం పెద్దకొత్తపల్లికి చేరుకోగా.. బస్సు కేవలం మహిళలకు మాత్రమేనని, పురుషులకు కాదని చెప్పడంతో డ్రైవర్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బస్సును నిలిపివేశారు. ఈ సందర్భంగా డ్రైవర్‌, కండక్టర్‌ మాట్లాడుతూ డిపో మేనేజర్‌ ఆదేశాల మేరకు తాము పురుష ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవడం లేదని చెప్పారు. డబ్బులు చెల్లించి ప్రయాణించే పురుషులపైనే వివక్ష చూపించడం ఏమిటని పలువురు చర్చించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement