కందనూలు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించనందున తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే 2010 ఆగస్టు కంటే ముందు నియామకమైన ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా మే 5న ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డిని నియమించారు.
నేడ దిశ సమావేశం
కందనూలు: జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ఎంపీ మల్లురవి అధ్యక్షత వహిస్తారన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి పథకాల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై సమావేశంలో సమగ్రంగా చర్చిస్తారని, పథకాల అమలులో పారదర్శకత, సమన్వయం పెంపొందించేందుకు అవసరమైన చర్యలను సూచిస్తారని చెప్పారు. సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు.
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
కందనూలు: జిల్లాకేంద్రంలో నిర్వహించిన పదో తర గతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని డీఈఓ రమేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉపాధ్యాయులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సమాధాన పత్రాల మూల్యాంకనం సకాలంలో పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇందులో పారదర్శకత, కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి సమాధాన పత్రాన్ని నిబంధనల కు అనుగుణంగా జాగ్రత్తగా పరిశీలించడంతోపాటు మార్కుల నమోదు ప్రక్రియను కూడా సమాంతరంగా నిర్వహించినట్లు చెప్పారు.
డ్రైవర్, కండక్టర్లు కావాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: టీజీఎస్‌ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె జరుగుతున్న నేపథ్యంలో సమ్మెకాలంలో పనిచేసేందుకు డ్రైవర్, కండక్టర్ అభ్యర్థుల నుంచి అత్యవసరంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న డ్రైవర్‌లకు రోజుకు రూ.వెయ్యి, కండక్టర్‌లకు రూ.800 పారితోషికం ఇస్తామన్నారు. అచ్చంపేట, గద్వాల, కల్వకుర్తి, కొల్లాపూర్, కోస్గి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, షాద్‌నగర్, వనపర్తిల నుంచి ఆసక్తిగల అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని కోరారు. డ్రైవర్ అభ్యర్థులకు తెలుగులో రాయడం, చదవడం, హెవీ ట్రాన్స్‌పోర్టు వెహికల్ లైసెన్స్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ లేదా హెవీ ప్యాసింజర్ వెహికల్ లైసెన్స్, 25–50 ఏళ్లలోపు, కండక్టర్ అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత, 21 నుంచి 58 ఏళ్లలోపు అర్హులన్నారు.


