● నేటినుంచి జూన్ 7 వరకు నిర్వహణకు సమాయత్తం
● 14 ఏళ్లలోపు బాలబాలికలకుక్రీడల్లో శిక్షణ
● జిల్లాలో పది శిబిరాల
ఏర్పాటుకు అనుమతి
అచ్చంపేట: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం నుంచి జూన్ 7 వరకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి 14 ఏళ్లలోపు బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది.
రూ.60 వేలు మంజూరు..
జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60 వేలు మంజూరు చేసింది. ఒక్కో శిక్షకుడికి రూ.5 వేల చొప్పున 10 మందికి రూ.50 వేలు ఇవ్వనున్నారు. మిగిలిన రూ.10 వేలు ప్రథమ చికిత్స, సర్టిఫికెట్ల కోసం ఖర్చు చేయనున్నారు. శిబిరాలను జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ అధికారి నిర్వహణ బాధ్యతతోపాటు పర్యవేక్షణ చేయనున్నారు.
పలు అంశాల్లో శిక్షణ
వేసవి శిబిరాల్లో ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్‌తోపాటు కబడ్డీ తదితర క్రీడాంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. శిబిరాలను ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 14 ఏళ్లలోపు బాలబాలికలకు మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది.
సద్వినియోగం చేసుకోండి..
జిల్లాలో 10 శిక్షణ శిబిరాలకు అనుమతి ఉంది. ఈ శిబిరాలలో విద్యార్థులకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. అచ్చంపేట, బల్మూర్, పెద్దకొత్తపల్లి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌లో శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు 6 దరఖాస్తులు అందాయి.
– సీతారాం, డీవైఎస్‌ఓ


