కందనూలు: భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథుడి చిత్రపటానికి కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యంపై అంకితభావం, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చని భగీరథుడి జీవితం యువతకు గొప్ప సందేశం ఇస్తుందన్నారు. భగీరథుని ఆశయాలకు అనుగుణంగా సమాజంలో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. భగీరథుడు భూమిపైకి గంగను తెచ్చిన మహనీయుడని, వారి త్యాగనిరతి, పట్టుదల ఆదర్శనీయమని ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా సగర కుల సంఘాల ప్రతిపాదనలపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయ అధికారి శ్రీరాములు, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కౌన్సిలర్ చంద్రకళ, నాయకులు రాముడు, సాయిలు, బాలయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
లింగ నిర్ధారణ చట్టం నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ బదావత్ సంతోష్ చేశారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమాజంలో బాలికలపై వివక్షను నివారించడమే లింగ నిర్ధారణ చట్టం ప్రధాన లక్ష్యం అన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు అనుమతులు పూర్తిగా నిబంధనల ప్రకారమే మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ రవికుమార్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ జిల్లా ప్రెసిడెంట్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


