నాగర్‌కర్నూల్ క్రైం: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రవాణా సౌకర్యార్థం విధులకు హాజరయ్యే ప్రైవేటు డ్రైవర్లకు, కండక్టర్లకు పోలీసులు పూర్తి భద్రత కల్పిస్తారని, ప్రతి డిపో పరిధిలో బస్సు రూట్లలో పోలీస్ పెట్రోలింగ్ ఉంటుందన్నారు. విధుల్లో ఉన్న డ్రైవర్లను అడ్డుకోవడం, భయబ్రాంతులకు గురిచేస్తూ చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లతోపాటు బస్ డిపోల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డిపో మేనేజర్ యాదయ్య తదితరులున్నారు.


