జిల్లాలో వణికిస్తున్న వీధికుక్కలు
నమోదైన కేసులు..
మటన్, చికెన్ వ్యర్థాలు..
పేరుకు మాత్రమే..
అధిక ఉష్ణోగ్రతలతో ఇరిటేషన్..
● ఒక్క మార్చిలోనే 566 కుక్క కాటు కేసులు
● తీవ్ర భయాందోళనలో చిన్నారులు,
వృద్ధులు
● జిల్లాకేంద్రంలో నిరుపయోగంగా మారిన ఎనిమల్ కేర్ సెంటర్
● రూ.50 లక్షలు వెచ్చించినా
ఉపయోగంలోకి రాని వైనం
సాక్షి, నాగర్‌కర్నూల్/ కందనూలు: బయటికి వెళ్లాలంటే వీధి కుక్కలు బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆరుబయట కనిపిస్తే చాలు జనాలపై దాడులు చేస్తున్నాయి. గుంపులు, గుంపులుగా తిరుగుతూ వెంబడిస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలన్నా.. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి రావాలన్నా.. తల్లిదండ్రుల గుండెల్లో వణుకు పుడుతోంది. ప్రజలు ఇంట్లోంచి కిరాణా షాపులు, ఇతర పనులకు, కూలీకి వెళ్లాలన్న భయపడుతున్నారు. ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా వెంబడించి కరుస్తున్నాయి. ఇక రాత్రిపూట రోడ్లపై ద్విచక్రవాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలోని శ్రీపురం రోడ్డు, నల్లవెల్లి రోడ్డు, ఇతర కాలనీల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డు, బస్టాండ్ ఆవరణలో ఒకేరోజు ఆరుగురు ప్రయాణికులను కుక్క కరిచిన ఘటన చోటుచేసుకుంది.
జిల్లాలోని మున్సిపాలిటీ కేంద్రాల్లో చికెన్ ఫ్రై సెంటర్లు, మటన్ షాపుల నిర్వాహకులు వ్యర్థాలను ఇష్టారాజ్యంగా షాపుల వెనకాల, రోడ్డు పక్కన పడేస్తున్నారు. దీంతో వాటి కోసం కుక్కలు అధికంగా వస్తున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టం వచ్చినట్లు వ్యర్థాలను రోడ్డు పక్కనే వేస్తున్నారు. మాంసానికి అలవాటు పడిన కుక్కలు మాంసం లభించనప్పుడు మేకలు, గొర్రె మందలపై దాడి చేస్తున్నాయి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాల నుంచి ఇంటికి వచ్చే విద్యార్థులు, అలాగే సాయంత్రం వేళల్లో పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సందర్భాల్లో, రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ద్విచక్రవాహనదారులు కిందపడి గాయపడిన ఘటనలు కోకొల్లలు.
జిల్లావ్యాప్తంగా 2019 లెక్కల ప్రకారం 14,141 కుక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు మళ్లీ వీటి గణన చేపట్టలేదు. ప్రస్తుతం వీటి సంఖ్య రెట్టింపైనట్లు అంచనా. గత జనవరిలో 423, ఫిబ్రవరిలో 314, మార్చిలో 566 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. మార్చి నెలలో కుక్కకాటు కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఇక వచ్చే నెలలో కుక్కల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాకేంద్రంలోని గగ్గలపల్లి రోడ్డులో రూ.50 లక్షలతో నిర్మించిన యానిమల్ కేర్ సెంటర్ పేరుకు మాత్రమే కనిపిస్తోంది. ఏ ఒక్కరోజు కూడా ఇక్కడ కుక్కలకు సంబంధించిన ట్రీట్‌మెంట్ చేసిన దాఖలాలు కనిపించలేదు. ఫలితంగా రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన కేంద్రం నిరుపయోగంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కలను ఎనిమల్ కేంద్రాలకు తరలించి ప్రజలకు కుక్కల బెడద తప్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
జిల్లాలో గడిచిన పది రోజుల నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్ వచ్చి.. దాహం ఎక్కువై ఇతరులపై దాడులు చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆగ్రహంతో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వారిపై దాడి చేస్తున్నాయి. సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరకక ఇలా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా పిల్లలపై అధికంగా ప్రతాపం చూపిస్తున్నాయి.


