రీజియన్‌లో 134 నడిచిన బస్సులు
జిల్లాలో రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు
● ఎక్కడికక్కడ స్తంభించిన రవాణా వ్యవస్థ
● డిపో గేట్ల ముందు బైఠాయించి
కార్మికుల ధర్నా
● తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు
● అవకాశాన్ని ఆసరా చేసుకుంటున్న
ప్రైవేటు వాహనదారులు
కందనూలు/అచ్చంపేట రూరల్/ కల్వకుర్తి టౌన్/కొల్లాపూర్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో జిల్లావ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని పలు డిపోలలో తమ సమస్యలు పరిష్కరించాలని కండక్టర్లు, డ్రైవర్లు బస్ డిపోల ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మెతో జిల్లావ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలోని అనేక మార్గాల్లో బస్సులు నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, దినసరి కూలీలు, ఇతర పనుల కోసం వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ అధికారులు సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రైవేటు వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బస్ డిపోల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు.
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ హైర్, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్‌నగర్ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు.


