బిజినేపల్లి: మండలానికి చెందిన మినీ గురుకులంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 1–5 తరగతుల్లో ప్రవేశాల కోసం గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెచ్‌ఎం శ్వేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 30 సీట్లు, 2వ తరగతిలో 3, 5వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు తమ ఆధార్, జనన, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 2 పాస్ ఫొటోలతో వచ్చేనెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం మండల కేంద్రంలోని మినీ గురుకులంలో సంప్రదించాలని కోరారు.
50 శాతం సబ్సిడీపై
తీగజాతి కూరగాయలు
కొల్లాపూర్ రూరల్: రాష్ట్ర ఉద్యాన శాఖ ద్వారా ఆర్‌కేవీవై పథకంలో భాగంగా రైతులు తీగ జాతి కూరగాయలు సాగు చేయడానికి తీగ జాతి పందిరి నిర్మాణాల కోసం 50 శాతం సబ్సిడీ అందిస్తుందని కొల్లాపూర్ ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పందిరి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50 శాతం రైతులకు చెల్లిస్తుందన్నారు. కాకర, బీర, సోర, పొట్ల, దొండ వంటి తీగ జాతి కూరగాయలు పండించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. వీటి సాగు వల్ల రెండు సంవత్సరాల వరకు దిగుబడి వచ్చి.. ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం చేకూరుతుందన్నారు. ఈ పంటలు ఏడాదికి మూడు సార్లు సాగు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
24న సంసద్ ఖేల్
ముగింపు వేడుకలు
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్‌ఖేల్ మహోత్సవానికి యువత నుంచి విశేష స్పందన లభించినట్లు ఇన్‌చార్జీలు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, కిరణ్‌కుమార్, నవీన్‌కుమార్ తెలిపారు. మండల, అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లోని మెయిన్ స్టేడియం వేదికగా ఈనెల 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ పరిధిలోని ప్రజలు, క్రీడాభిమానులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఇద్దరు ఆర్టీసీ కార్మికులపై కేసు నమోదు
నాగర్‌కర్నూల్ క్రైం: ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులు నడపకుండా ఇబ్బందులకు గురిచేసిన ఇద్దరు కార్మికులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెలో నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు ఆటంకం కలిగించిన కొల్లాపూర్‌లో, కల్వకుర్తిలో ఒక్కొక్కరిపై కేసు నమోదైందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరితే వారిని ఎవరైనా ఆర్టీసీ కార్మికులు ఆపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
– వెల్దండ
తీరనున్న లోవోల్టేజీ సమస్య
చివరి దశకు చేరుకున్న సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
వివరాలు 9లో..


