కందనూలు: బసవేశ్వరుడి అడుగుజాడల్లో పయనిద్దామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి హాజరై బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బసవేశ్వరుడు కుల, మతాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప అభ్యుదయ వాది అన్నారు. మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆ మహనీయుడి ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టిన గొప్ప సంస్కర్త బసవేశ్వరుడు అని, ఆయన బోధించిన అభ్యుదయవాద సంప్రదాయమే నేడు లింగాయత్ ధర్మంగా మారిందన్నారు. 12వ శతాబ్దంలోనే మహిళలకు సముచిన స్థానం కల్పించారని, బసవేశ్వరుడు చెప్పిన సిద్ధాంతాలను కేవలం మాటల్లో కాకుండా మన జీవితాల్లో ఆచరణలో పెట్టి ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే ఆయనకు మనం నిజమైన గౌరవం తెలిపినట్లవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ మూఢనమ్మకాలపైన నిరంతరం పోరాటం చేసిన మహానుభావుడు బసవేశ్వరుడన్నారు. లింగాయత్ సంఘం నాయకులు జిల్లాకేంద్రంలో బసవేశ్వరుడి విగ్రహం, బసవేశ్వర భవన ఏర్పాటు చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీరాములు, జిల్లా గౌరవాధ్యక్షుడు సురేష్, జిల్లా ప్రెసిడెంట్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు మ్యాపింగ్ వేగవంతం చేయాలి
కందనూలు: జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట పరిధిలో 7,38,439 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 4,74,767 మందిని (64.29 శాతం) గుర్తించి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశామని, రానున్న పదిరోజుల్లో మిగతాది పూర్తిచేస్తామని వివరించారు.


