నాగర్‌కర్నూల్ క్రైం: అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్తి, ప్రాణనష్టాన్ని తగ్గించుకునేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా అగ్ని మాపకశాఖ అధికారి గిరిధర్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతిఒక్కరు నివారణ యంత్రాలను అమర్చుకోవాలన్నారు. ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరిగితే నిర్లక్ష్యం వహించకుండా వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందిస్తే ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


