అచ్చంపేట: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, వంటశాలలు, నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాలను పరిశీలించి.. సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతి విభాగంలో శుభ్రత పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా వంటశాలలో ఆహారం తయారీ సమయంలో నాణ్యత ప్రమాణాలు, శుభ్రతపై ఎలాంటి రాజీ పడకూడదన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం పోషక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, సరైన డైట్ ప్లాన్ అమలు చేయాలని, ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలని, గడువు ముగిసిన పదార్థాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులపై దృష్టిసారిస్తూ.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని మరమ్మతు చేయించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను ఆయన పరిశీలించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి, సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి పోటీలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల గురించి ఆరా తీశారు.


