అచ్చంపేట: ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఏప్రిల్‌లోనే ఎండలు దంచికొడుతుండటంతో, వచ్చేనెల పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. రోజు 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వివిధ పనులకు వెళ్లే వారు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం భానుడు భగభగ మండిపోతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వచ్చే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక
ఎండ తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక.. ఉక్కపోతతో ఇంట్లో ఉండలేక ఆగమాగమవుతున్నారు. వృద్ధులు, పిల్లలు సైతం ఎండలు, ఉక్కపోతతో తల్లడిల్లుపోతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేందుకు కూడా జనాలు జంకుతున్నారు. దాహం తీర్చుకునేందుకు చల్లని శీతలపానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంత మంది వడదెబ్బకు గురై అస్పత్రుల పాలవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
ఫ్యాన్లు, కూలర్లకు మరమ్మతు..
ఎండ తీవ్రతకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ సంఖ్యలో మధ్యాహ్నం, రాత్రివేళల్లో కూలర్లతో పాటు ఫ్యాన్లతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇదివరకే మరమ్మతుకు గురైన ఫ్యాన్లు, కూలర్లను బాగు చేయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఇవీ కూడా పనిచేయకపోవడంతో ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కూలర్లు, ఏసీల రేట్లు సైతం పెరిగాయి.
నియోజకవర్గం గరిష్టం కనిష్టం
నాగర్‌కర్నూల్ 40 27
అచ్చంపేట 38 26
కొల్లాపూర్ 41 28
కల్వకుర్తి 40 27
పాటించాల్సిన జాగ్రత్తలు..
వేసవిలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా తీసుకోవాలి.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నీడ పట్టున ఉండాలి.
ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించాలి.
ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లేలా ప్లాన్
చేసుకోవాలి.
ఎండలో పనులు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు నీడలో ఉండేలా చూసుకోవాలి.
అల్కాహాల్, సిగరేట్, కార్పోనేటేడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
ప్రయాణాల్లో సోడియం, ఎలక్ట్రోలైట్ ద్రావణాలను తాగడం మంచిది.
జిల్లావ్యాప్తంగా ఆదివారం
నమోదైన ఉష్ణోగ్రత్తలు
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఎండ వేడమి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
ఫ్యాన్లు, కూలర్ల చల్లదనం సరిపోక అల్లాడుతున్న ప్రజలు
అత్యవసరమైతేనే బయటకు రావాలి..
ఎండల తీవ్రత రోజూరోజుకు పెరుగుతోంది. వడదెబ్బ బారినపడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కూలీలు, వ్యవసాయదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. చెమట రూపంలో శరీరంలోని లవణాలు బయటకు పోతాయి. అందుకే లవణాలతో కూడిన ద్రావణం తీసుకోవాలి. తప్పనిసరి అయితేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలి. ఓఆర్‌ఎస్ పాకెట్లు ఐవీ ప్లూయిడ్స్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. – డా.తారాసింగ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ


