‘మిషన్ భగీరథశ్రీకు కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోతలు
● ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల నీటిమట్టం
● 800 అడుగుల వరకు నీటిని
ఎత్తిపోసుకునే అవకాశం
● వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారుల చర్యలు
ప్రస్తుతం ఎలాంటి
ఇబ్బందులు లేవు..
ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్‌ఐ ప్రాజెక్టు వద్ద 820 అడుగుల మేరకు కృష్ణా బ్యాక్‌వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాల మేరకు ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణా బ్యాక్‌వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఇక ఢోకా ఉండదు.
– అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ
కొల్లాపూర్: శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్కీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాలకు తాగునీరు అందుతోంది. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.
తగ్గుతున్న నీటిమట్టం..
కృష్ణానదిలో కొన్ని రోజులుగా నీటిమట్టం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. యాసంగి సీజన్ ముగింపునకు చేరడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం మిషన్ భగీరథ కోసమే నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.
సరఫరా ఇలా..
ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్‌హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్‌లైన్లు, వాటర్‌ట్యాంకులు నిర్మించి.. నీటి సరఫరా చేస్తున్నారు.


