పాలెం వెంకన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి | - | Sakshi
Sakshi News home page

పాలెం వెంకన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి

Apr 20 2026 9:41 AM | Updated on Apr 20 2026 9:41 AM

బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌.రాజేశ్వరరావు సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అలమేలుమంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం న్యాయమూర్తిని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు కురవి రామానుజాచార్యులు, సర్పంచ్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

నేడు ‘రైతుభరోసా’ జమ

కందనూలు: రెండో విడత రైతుభరోసా నిధులు సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 103కోట్లు జమకానున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పంట పెట్టుబడి సాయం విడుదల చేయనున్న సందర్భంగా జిల్లాలోని 63 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ పాల్గొనేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

బాల్యవివాహాలను నిర్మూలిద్దాం

అచ్చంపేట: బాల్యవివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీశైలం కోరారు. యాక్సెస్‌ టు జస్టిస్‌ ప్రాజెక్టులో భాగంగా ఆదివారం కోనేరు ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అచ్చంపేట మండలం నడింపల్లి కేజీబీవీ విద్యార్థినులతో పాటు ఉమామహేశ్వరాలయం వద్ద భక్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థినులు ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు వివాహాలు చేయాలనే ఆలోచన చేస్తారని.. అలాంటి ఇబ్బందులు ఉంటే వెంటనే 1098 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్యవివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ శిక్షార్హులవుతారని హెచ్చరించారు. అనంతరం బాల్యవివాహాల నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉమామహేశ్వరాలయం వద్ద బాల్యవివాహాలు చేయకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అనంతరం అచ్చంపేట చర్చిలో బాల్యవివాహాలు చేయరాదని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీపీసీ మల్లేష్‌, కోనేరు ఎన్జీఓ సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement