కందనూలు: జిల్లావ్యాప్తంగా 1నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)–2 పరీక్షలు శనివారంతో ముగిశాయి. అయితే విద్యార్థుల ప్రతిభను తెలిపే ప్రోగ్రెస్ కార్డుల విధానానికి స్వస్తి పలికిన పాఠశాల విద్యాశాఖ.. ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల ప్రగతి పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ వద్ద నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక (ఎస్‌ఏ–1) పరీక్ష ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 22లోగా ఎస్‌ఏ–2 పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇది వరకు నిర్వహించిన నిర్మాణాత్మక (ఎఫ్‌ఏ–1, 2, 3, 4), సంగ్రాహణాత్మక (ఎస్‌ఏ–1) మూల్యాంకనానికి సంబంధించిన ఫలితాల అప్‌లోడ్ ప్రక్రియ పూర్తయింది. ఎస్‌ఏ–2 పరీక్షలకు సంబంధించి ఉపాధ్యాయులు జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. బుధవారంలోగా ఆన్‌లైన్‌లో ఫలితాల నమోదు ప్రక్రియ పూర్తిచేసి.. గురువారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నారు. వారి సమక్షంలో ఆన్‌లైన్ ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు తెలిపారు.


