మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. కేఎల్‌ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒకసారి రిజర్వాయర్‌ను నింపితే.. దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే వేసవిలో ఎల్లూరు రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుజాగ్రత్తగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లో 4 టీఎంసీలకు పైగా నీటిని నిల్వచేసి ఉంచారు. ఈ నీటిని మిషన్ భగీరథకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నపుతండా వద్ద రూ. 10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెగ్యులేటరీ సిస్టమ్ పనులు కూడా తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే ఇకనుంచి రెగ్యులర్‌గా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇది అమలైతే కేఎల్‌ఐ ప్రాజెక్టుపై ఇన్నాళ్ల నుంచి పడుతున్న ఒత్తిడి తగ్గుతోంది.


