వివిధ రూపాల్లో సేవలు..
కేటగిరీలను బట్టి వసూలు..
బోర్డులు ఏర్పాటు చేయాలి..
● ఈ నెల మొదటి తేదీ నుంచే
అమలులోకి..
● గతంలో కన్నా ఒక్కో సర్టిఫికెట్‌పై
75 శాతం వరకు పెంపు
● అదనపు రుసుంతో పేదలు,
రైతులపై పడనున్న భారం
●
మీసేవ కేంద్రాల సేవలపై భారీగా చార్జీలు పెంచిన ప్రభుత్వం
మీసేవ కేంద్రాలలో ప్రభుత్వం అమాంతం సర్వీస్ చార్జీలను పెంచడం సరికాదు. ఒక్కో సేవపై సుమారు రూ.10 పెంచిన ఇబ్బందులు ఉండేవి కావు. ఒకేసారి సర్వీస్ చార్జీలను సేవను బట్టి సుమారు 70– 80 శాతం పెంచడం మంచి పరిణామం కాదు. సర్వీస్ చార్జీల పెంపుపై ప్రభుత్వం మరోమారు పునరాలోచించాలి.
– సాయిప్రసాద్, కల్వకుర్తి
ప్రభుత్వం ఈ నెల మొదటి రోజు నుంచే మీసేవల ద్వారా అందించే సేవల రుసుంను పెంచింది. పెంచిన ధరల సమయంలో సర్వర్ సరిగా లేకున్నా.. ప్రస్తుతం మెరుగుపడింది. ప్రజలు కూడా పెరిగిన సర్వీస్ చార్జీలను అర్థం చేసుకొని సేవలు పొందుతున్నారు. నూతనంగా పెరిగిన రుసుంల పట్టికను కేంద్రాలలో ఏర్పాటు చేశాం.
– ఆంజనేయులు,
మీ సేవ నిర్వాహకుడు, కల్వకుర్తి
మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు సంబంధించి రుసుంలు పెరిగాయి. పెరిగిన ధరలను ఆయా మీసేవా కేంద్రాల నిర్వాహకులు బోర్డులలో ప్రదర్శించారు. పెరిగిన ధరలకు ఏమైనా అధికంగా వసూలు చేస్తే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
– అమరేందర్,
అదనపు కలెక్టర్ (రెవెన్యూ)
కల్వకుర్తి టౌన్: కుల, ఆదాయ సర్టిఫికెట్లు కావాలంటే తప్పనిసరిగా మీ–సేవకు వెళ్తేనే పని అవుతుంది. పేదలు, రైతులకు సంబంధించి చాలా పనులకు ముడిపడి ఉన్న మీసేవ కేంద్రాల సర్వీస్ చార్జీలను ప్రభుత్వం అమాంతం పెంచింది. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులకు వివిధ ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ సేవలకు అందించే మీసేవ కేంద్రా ల్లో సర్వీస్ చార్జీలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు ఈ నెల మొదటి తేదీ ను ంచి అమల్లోకి వచ్చాయి. పెంచిన చార్జీల వల్ల రైతు లు, సామాన్య ప్రజలపై అధిక భారం పడుతోంది.
జిల్లాలో 139 మీసేవ కేంద్రాలు ఉండగా.. వాటిలో ప్రతినిత్యం ఒక్కో సెంటర్ ద్వారా సుమారు 250 నుంచి 300 సేవలు వివిధ రూపాల్లో ప్రజలకు అందుతున్నాయి. ఇందులో అత్యధికంగా పేద ప్రజలకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇవేకాక ప్రభుత్వం అందించే పలు పథకాల నమోదు కోసం మీసేవ కేంద్రాలను ప్రజల ఆశ్రయిస్తుంటారు. దీంతో మీసేవ చార్జీలు గణనీయంగా ఒకేసారి 75 శాతం పెంచడంతో ప్రజలకు కొంతమేర ఇబ్బంది కలుగుతుంది. సర్వీస్ చార్జీల పెంపునకు ముందు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం రూ.45 రుసుం ఉండగా.. ప్రస్తుతం పెంచిన చార్జీలతో ఆ రుసుం రూ.80కి చేరింది. ఇదిలా ఉంటే.. గతంలో సర్వీస్ చార్జికి అదనంగా రుసుంను వసూలు చేశాయని, సంబంధిత అధికారులు మీసేవలను కొన్ని రోజులు సస్పెన్షన్‌లో పెట్టిన సందర్భాలు లేకపోలేదు.
మీసేవ కేంద్రాలలో అందించే సేవలను ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరి సేవల కింద (పహాణి, ఈ–కేవైసీ, తక్షణ సేవలు) గతంలో కనీస చార్జి రూ.35 ఉండగా.. దానిని ప్రస్తుతం రూ.62కు పెంచారు. బీ కేటగిరి కింద మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయ్యే సేవల (కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు) చార్జీలు గతంలో రూ.45 ఉండగా దానిని ప్రస్తుతం రూ.80గా నిర్ధారించారు.
ధ్రువపత్రం ప్రస్తుతం
సర్వీస్ ధర
(రూ.లలో..)
ఆదాయం 80
కులం 80
నివాసం (రెసిడెన్సీ) 80
రేషన్ కార్డు 80
భూభారతి ఈ–కేవైసీ 80
కొత్త విద్యుత్ కనెక్షన్ 80
క్రిమీ, నాన్ క్రిమీలేయర్ 80
ఈసీ 62
ఫార్మర్ రిజిస్ట్రేషన్ 18
కోర్టు కేసు ఈ–కేవైసీ 62
బర్త్ సర్టిఫికెట్ ప్రింట్ 62
ఈ–పాస్ బయోమెట్రిక్ 35
త్రైమాసిన పన్ను 62
లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ 62
మీసేవ కేంద్రాలలో ప్రభుత్వం పెంచిన సర్వీస్ చార్జీల పట్టిక నూతన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిత్యం అవసరం పడే రైతులకు అదనపు చార్జీల భారంతో కొంత ఇబ్బందులు ఎదురవనున్నాయి. అమాంతం ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చార్జీలు పెంచడంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


