అచ్చంపేట/ ఉప్పునుంతల: జిల్లాలోని ఉప్పనుంతల మండలం కొరటికల్ గ్రామానికి చెందిన విద్యావంతుడు, జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సభ్యుడిగా నియామకం అయ్యారు. యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులుగా నలుగురు నియామకం కాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున టీ–శాట్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌రెడ్డిని ఎంపిక చేశారు. మారుమూల గ్రామమైన కొరటికల్‌లోని వ్యవసాయ కుటుంబానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకై న పాత్ర పోషిస్తూ.. జర్నలిస్టుగా, ఉద్యమనాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అనుక్షణం చురుకుగా ఉంటూ ప్రజాపాలనలో భాగస్వాములవుతూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా తనను ఈసీ మెంబర్‌గా నియమించేందుకు కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డికి వేణుగోపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వేణుగోపాల్‌రెడ్డి ఈసీ మెంబర్‌గా ఎంపిక కావడంతో గ్రామంతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
నేటి ప్రవేశ పరీక్షకు
సకాలంలో చేరుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని డీఈఓ రమేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని, విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని కోరారు.
30న కంటి వైద్య శిబిరం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో ఈ నెల 30న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ ఆఫీసర్ కొట్ర బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పాత కలెక్టరేట్‌లోని రూం నం.102లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ల కోసం లయన్ రాంరెడ్డి కంటి ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్‌కార్డుతోపాటు షుగర్, బీపీ పరీక్షల రిపోర్టు తీసుకురావాలని కోరారు. పూర్తి వివరాలకు సెల్ నం.94408 76556ను సంప్రదించాలని సూచించారు.
వడదెబ్బ బాధితులకు ప్రత్యేక చికిత్స వార్డు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తలుగుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా 10 బెడ్లతో వార్డు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ ఉషారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వడదెబ్బ రోగులకు ఆస్పత్రిలో వైద్యసేవలు అందించేందుకు ఆక్సిజన్, అవసరమైన మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయని, రోగులు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనరల్ ఆస్పత్రి ఫిజీషియన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సూర్యనారాయణ, వైద్య సిబ్బంది వడదెబ్బ రోగులకు ప్రత్యేక ఆరోగ్య సేవలు అందిస్తారని ఆమె చెప్పారు.
వట్టెం నవోదయలో
వందశాతం ఉత్తీర్ణత
కందనూలు: మండలంలోని వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపల్ బాలాజీనాయక్ తెలిపారు. శనివారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 97 శాతంపైగా మార్కులతో సింధూజరాణి విద్యాలయ మొదటి ర్యాంకు సాధించగా.. లిఖిత 96 శాతంపైగా మా ర్కులతో రెండోస్థానం సాధించిందని వివరించారు. విద్యార్థులు మెరుగైన సత్ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.


