నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు సంక్షేమ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, వసతి గృహాల వార్డెన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, కార్యక్రమాల అమలు, బాధ్యతల విభజనపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించినట్లు వెల్లడించారు. ప్రతి శాఖ తమ పరిధిలోని కార్యక్రమాలను సమయపాలనతో అమలు చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని, వివిధ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వార్డెన్లతో నేరుగా చర్చించినట్లు వివరించారు. కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్య సామర్థ్యాన్ని మించిపోవడం గమనించి.. అదనపు వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు. ఈ నెల 20న జిల్లాస్థాయిలో సమావేశం నిర్వహించి వివిధ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. 21న వసతి గృహాల్లో చదివి వెళ్లిన పూర్వ విద్యార్థులకు మండల స్థాయిలో కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 22న వసతి గృహాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, తాగునీటి సౌకర్యం, విద్యుత్, సీసీ కెమెరాల ఏర్పాటు, పెయింటింగ్, మరుగుదొడ్ల మరమ్మతు వంటి పనులను వేగవంతంగా పూర్తిచేస్తామన్నారు. 23న సంక్షేమ గురుకుల పాఠశాలల్లో తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతి, సమస్యలపై చర్చ, 24న ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, 25న జిల్లాస్థాయిలో అచ్చంపేట వద్ద వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం, 26న మండల స్థాయిలో పెద్ద గ్రామ పంచాయతీలలో బడిబాటపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, విద్యార్థుల చేరికలు పెంపొందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖల అధికారులు ఉమాపతి, ఫిరంగి, యాదగిరి, డీఈఓ రమేష్‌కుమార్, డీపీఓ శ్రీరాములు, డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు పాల్గొన్నారు.


