మామిడి రైతులకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతులకు ప్రోత్సాహం

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

వనపర్తి: మామిడి రైతులకు మెరుగైన మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించడం, నాణ్యమైన ఉత్పత్తులను ప్రోత్సహించడం ‘అమ్మకందారులు.. కొనుగోలుదారులు’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా మామిడి పంటకు సంబంధించి క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద ఉద్యానశాఖ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతుల అభివృద్ధి సంస్థ, ఎన్‌హెచ్‌బీ, ప్రసాద్‌ సీడ్స్‌ సంస్థ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వచ్చిన 140 మంది రైతులు తమ మామిడి ఉత్పత్తులను ప్రదర్శించారు. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై వాటిని పరిశీలించి రైతులతో మాట్లాడి పండ్ల ప్రత్యేకతను తెలుసుకోవడంతో పాటు మార్కెటింగ్‌ అవకాశాలపై అవగాహన కల్పించారు. వ్యాపారులు మామిడి రైతుల వద్దకే వచ్చి మంచి ధరకు పండ్లు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవడానికి చక్కటి అవకాశమని.. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులను కలెక్టర్‌ అభినందించారు. మామిడి రైతులకు కవర్లు అందజేయడం గొప్ప విషయమని, ఇంకా ఎవరికై నా ఇవ్వకపోతే వెంటనే అందజేయాలని సూచించారు. మొత్తం 12 మంది వ్యాపారులు పాల్గొని 40 మంది రైతుల నుంచి 250 టన్నుల మామిడిపండ్ల ఎగుమతులకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో ఉద్యానశాఖ జేడీ బాబు, డీహెచ్‌ఎస్‌ఓ విజయభాస్కర్‌, ఏపీ ఎగుమతిదారుల అభివృద్ధి సంస్థ ఏపీఎం ఆర్‌బీ నాయుడు, ప్రసాద్‌ సీడ్స్‌ సీఈఓ విజయభాస్కర్‌, శాస్త్రవేత్త వెంకటలక్ష్మి, రవి, లక్ష్మి, ఏడీలు పద్మనాభం, జయరాజ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్యాంకు గ్యారంటీ, అగ్రిమెంట్‌ తప్పనిసరి..

మిల్లులకు ధాన్యం కేటాయించాలంటే 10 శాతం బ్యాంకు గ్యారెంటీతో పాటు అగ్రిమెంట్‌ తప్పనిసరి అని కలెక్టర్‌ ఆదర్శ సురభి మిల్లర్లకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రూ.కోట్ల వరి ధాన్యం మిల్లులకు అడ్వాన్సుగా ఇస్తుందని.. కేటాయించిన ధాన్యంలో 10 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి అగ్రిమెంట్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement