కందనూలు: రబీ సీజన్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సేకరించడంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వరి కొనుగోళ్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ధాన్యం సేకరణ గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, నిల్వల వద్ద ఆలస్యం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు తమ పంటకు న్యాయమైన ధర పొందేలా ప్రభుత్వం చేపట్టిన వరి కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలన్నారు. రవాణా ప్రక్రియ వేగవంతం చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్లు నిర్దేశించిన సంఖ్యలో వాహనాలు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించేలా ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను బలోపేతం, ప్రతి సెక్టార్‌కు 25 లారీలు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. వాహనాల కొరత కారణంగా ధాన్యం తరలింపులో జాప్యం జరిగితే సంబంధిత ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా రైతులకు వసతులు కల్పించాలని సూచించారు. అకాల వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి.. పనుల్లో ఆలస్యం లేకుండా గడువులోగా పూర్తిచేయాలని, నాణ్యత, వేగం, లబ్ధిదారుల అవసరాల తీరు తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అధికారులు బాధ్యతగా వ్యవహరించి, ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన గృహం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, హౌసి ంగ్, మున్సిపల్ శాఖల అధికారులు ఉన్నారు.


