వెల్దండ: మండలంలోని గాన్‌గట్టుతండా వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జిని నాణ్యతగా, గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర క్వాలిటీ పర్యవేక్షణ అధికారి షేక్ ఇమామ్ అన్నారు. శుక్రవారం ఆయన గాన్‌గట్టుతండా రోడ్డులో నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించి.. నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.15 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. వాగుపై వంతెన పొడవు 97.44 మీటర్లు ఉండగా ఇందులో 9 కనాలు వచ్చే విధంగా డిజైన్ చేశామని, ఇప్పటి వరకు మూడు కనాలకు స్లాబ్ వేసినట్లు అధికారులు చెప్పారు. ఐదు సంవత్సరాల వరకు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 13న మొదటి కనాలకు స్లాబ్ వేశామని, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నీటిని సక్రమంగా పట్టాలని సూచించారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న వంతెన పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బ్రిడ్జి నిర్మాణంలో ఉపయోగించిన ఇసుక, సిమెంట్, ఇనుము ఏ సైజు రాడులను వేస్తున్నారని పూర్తి వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో కల్వకుర్తి డీఈఈ బస్వలింగం, ఏఈ సురేందర్‌రెడ్డి, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


