మొక్కజొన్న కొనాలని రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనాలని రైతుల ఆందోళన

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: జిల్లాకేంద్రంలోని మార్కెట్‌ యార్డులో అధికారులు మొక్కజొన్న పంట కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మార్కెట్‌ యార్డు ఎదురుగా ఉన్న అచ్చంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ విషయమై రైతులు మాట్లాడుతూ దాదాపు ఐదు రోజులుగా మార్కెట్‌ యార్డులోనే మొక్కజొన్న ధాన్యాన్ని పోసుకొని పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత ఉందంటూ కుంటి సాకులు చెబుతూ తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. దళారులు చూపించిన వ్యక్తులకే సంచులు ఇచ్చి వారి ధాన్యాన్ని చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా లారీల్లోకి ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో దళారులు గద్దల్లా వాలిపోయి తమ మొక్కజొన్నను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరా పొలానికి మొక్కజొన్న దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ ఒక్కో ఎకరాకు తక్కువ పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ నమోదు, వ్యవసాయ శాఖ అనుమతి పత్రాలు, మార్క్‌ఫెడ్‌ వద్ద వేలిముద్రలు వంటి ప్రక్రియలతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. తీరా గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. వర్షపు చినుకు పడితే తమ కష్టార్జితం పూర్తిగా వర్షంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న మార్కెటింగ్‌ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం జిల్లావ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లోనే మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అధికంగా మొక్కజొన్న ఉన్న గ్రామాలకు నేరుగా లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement